పటాన్చెరు, 19 September
సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనగూడ వరకు ఎన్హెచ్-65పై చేపట్టిన 6 వరుసల రహదారి విస్తరణ పనులు నిర్ణయించిన గడువు దాటినా పూర్తికాకపోవడంపై నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 1,297 కోట్లకు పైగా ప్రజాధనంతో చేపట్టిన ఈ పనుల్లో కేవలం 32 శాతం మాత్రమే పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనగూడ వరకు ఎన్హెచ్-65పై చేపట్టిన 6 వరుసల రహదారి విస్తరణ పనులు నిర్ణయించిన గడువు దాటినా పూర్తికాకపోవడంపై నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 1,297 కోట్లకు పైగా ప్రజాధనంతో చేపట్టిన 29.35 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనుల్లో ఇప్పటి వరకు కేవలం 32 శాతం మాత్రమే భౌతిక పురోగతి నమోదవడం, మిగిలిన పనులు ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశమని మెట్టు శ్రీధర్ అన్నారు.
ఎక్కడ చూసినా సగం పనులు చేసి వదిలేయడం, పూర్తి స్థాయిలో రహదారి పనులు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో కొద్ది కిలోమీటర్ల ప్రయాణానికే గంటల తరబడి సమయం పడుతోందని, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన తెలిపారు. ఎన్హెచ్ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, పనుల నాణ్యతను పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన రహదారిని అందించాలని, ప్రజాధనం భారీగా ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్టులో నాణ్యత, భద్రత, సమయపాలన విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.












