మండలం నాగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా శనివారం న్యూట్రిషన్ ఫెయిర్ (పోషకాహార ప్రదర్శన) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పోషకాహార పదార్థాలను ప్రదర్శించారు.
పాఠశాల హెచ్ఎం డి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో విద్యార్థులు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల వారి శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఆహారం ద్వారానే ఆరోగ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పు దినుసులు, తృణధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషక పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు. పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ టీచర్ రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. పోషకాహారం ప్రాధాన్యతను తమ కుటుంబ సభ్యులకు కూడా వివరించాలని విద్యార్థులకు సూచించారు.











