సంగారెడ్డి, 2026-11-21
కల్తీ కల్లు తయారీకి వాడే క్లోరో హైడ్రేట్ అక్రమ రవాణాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. కామారెడ్డి నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 56 కిలోల క్లోరో హైడ్రేట్ను మెదక్ ఎన్ఫోర్స్మెంట్ బృందం పట్టుకుంది. దీని విలువ సుమారు రూ.2.80 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసి, మరొకరిపై కేసు నమోదు చేశారు.
కల్తీ కల్లు తయారీకి వినియోగించే క్లోరో హైడ్రేట్ (సీహెచ్) అక్రమ రవాణాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. కామారెడ్డి నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 56 కిలోల క్లోరో హైడ్రేట్ను మెదక్ ఎన్ఫోర్స్మెంట్ బృందం పట్టుకుంది. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.2.80 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరిపై కేసు నమోదు చేశారు. కల్తీ కల్లు తయారీకి క్లోరో హైడ్రేట్, ఆల్ప్రాజోలం వంటి పదార్థాలను అక్రమంగా తరలిస్తూ వినియోగిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మెదక్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు శ్రీనివాస్, బిజ్జానాయక్, ఎస్ఐ శంకర్ తమ సిబ్బందితో కలిసి జాతీయ రహదారులపై వాహన తనిఖీలు చేపట్టారు. ముందస్తు సమాచారంతో 161, 165 జాతీయ రహదారులపై నిఘా ఏర్పాటు చేశారు. కంది గ్రామం వద్ద మారుతి కారును ఆపి తనిఖీ చేయగా, 28 కిలోల చొప్పున రెండు బ్యాగుల్లో మొత్తం 56 కిలోల క్లోరో హైడ్రేట్ లభ్యమైంది. కారులో ఉన్న ఉమాకాంత్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తన బావ తిప్పారం వెంకట్ గౌడ్ క్లోరో హైడ్రేట్ను హైదరాబాద్కు తీసుకెళ్లి అందజేయాలని చెప్పడంతో తరలిస్తున్నట్లు ఉమాకాంత్ వెల్లడించాడు. దీంతో వెంకట్ గౌడ్ పై కూడా కేసు నమోదు చేశారు. విచారణలో వెంకట్ గౌడ్ క్లోరో హైడ్రేట్, ఆల్ప్రాజోలం వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. క్లోరో హైడ్రేట్తో పాటు మారుతి కారును సీజ్ చేసి, నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో కీలకంగా వ్యవహరించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్రావు, మెదక్ డిప్యూటీ కమిషనర్ ఏ.చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ డి.గాయత్రి అభినందించారు.







