మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 23
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని, దీనితో పేదలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు లబ్ధి పొందుతారని తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్‌ను 925 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 56, 55 డివిజన్లలో భక్తాంజనేయ హనుమాన్ టెంపుల్ వద్ద సోమవారం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో టీఆర్ఎస్ పాలనలో కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరిందని, మరో 70 శాతం ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని అందిస్తుందని, దూరదృష్టితో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే అన్నారు. దీంతో పేదలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు లబ్ధి పొందుతారని వెల్లడించారు. మంచిర్యాల కార్పొరేషన్‌ను 925 కోట్లతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ రేషన్ కార్డులు, గృహాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరుగుతోందని, త్వరలోనే రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పన విస్తృతంగా జరుగుతుందని చెప్పారు. అనంతరం మేయర్ మధుకర్ మాట్లాడుతూ, మంచిర్యాలలో గర్వించదగ్గ పాలన ఎమ్మెల్యే చేస్తున్నారని తెలిపారు. దానిలో భాగంగా 650 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 0 కోట్లు కేటాయించామని, 11 కోట్లతో మహాప్రస్థానం, 78 కోట్లతో అండర్ డ్రైనేజీ, విద్యుత్ ఆధునికీకరణ పనులు సాగుతున్నాయని చెప్పారు. 10.50 కోట్లతో విశ్వనాథ ఆలయం, 20 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మాణం, 120 కోట్లతో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మంచిర్యాల అభివృద్ధి రాష్ట్రానికే గర్వకారణంగా, దేశంలోనే నంబర్ వన్‌గా నిలవాలనే చిత్తశుద్ధితో ఎమ్మెల్యే పని చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ఈ అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని మేయర్ మధుకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు నల్ల శంకర్, గాండ్ల సత్తెమ్మ, కర్రు శంకర్, పెంట రజిత తదితరులు పాల్గొన్నారు.






