మంచేరియల్, 20 November
ఎన్నికల ఫలితాలను సుమారు 60 శాతం నిశ్శబ్ద ఓటర్ల తీర్పు నిర్దేశిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల వేళ రాజకీయ ప్రచారాలు, సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు, మీడియా విశ్లేషణలు హోరెత్తుతుంటాయి. ఎవరు ముందున్నారు ఎవరు వెనుకబడ్డారు ఏ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి అంటూ అంచనాలు సాగుతుంటాయి. అయితే ఈ అంచనాలకు అందకుండా నిశ్శబ్దంగా తమ నిర్ణయాన్ని దాచుకునే ఓటర్లు ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తారు.
సుమారు 40 శాతం ఓటర్ల అభిప్రాయాలు ప్రచారాలు రాజకీయ చర్చలు మీడియా కథనాలు సర్వేలు వంటి మార్గాల్లో కొంతవరకు అంచనా వేయగలిగినా మిగిలిన 60 శాతం ఓటర్ల మనోగతాన్ని తెలుసుకోవడం అంత సులభం కాదు. గ్రామాలు పట్టణాల్లో నిశ్శబ్దంగా ఉండే ఈ ఓటర్లు పోలింగ్ రోజు ఓటు హక్కు అనే బ్రహ్మాస్త్రంతో రాజకీయ సమీకరణాలను తలకిందులు చేయగలరు. వారి నిర్ణయమే నాయకుల గెలుపోటములను ప్రభుత్వాల మార్పులను నిర్దేశించే సందర్భాలు అనేకం.
ప్రచార హోరు మీడియా అంచనాలు సర్వే ఫలితాలే ప్రజాభిప్రాయానికి పూర్తి ప్రతిబింబం కావు. ప్రజల అసలు మనోగతాన్ని తెలుసుకోవాలంటే పాదయాత్రలు ఇంటింటి ప్రచారం క్షేత్రస్థాయి పర్యటనలు ప్రజలతో ప్రత్యక్ష సంభాషణలు అవసరం. పైకి కనిపించే రాజకీయ వాతావరణానికి ఓటు రూపంలో బయటపడే ప్రజాతీర్పుకు మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. ఈ వాస్తవాన్ని విస్మరిస్తే ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారినప్పుడు అంచనాలు తారుమారవుతాయి.
మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియతో భవిష్యత్తులో నియోజకవర్గాల రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. స్థానాల ఖరారు తర్వాత కొత్త వ్యూహాలు కొత్త అభ్యర్థులు కొత్త ఓటర్లపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.
2028 2029 ఎన్నికలపై ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఓటర్ల జాబితాలో మార్పులు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
అందుకే, ఎన్నికల ప్రచారంలో కనిపించే హడావిడి, మీడియా విశ్లేషణలకు మించి, నిశ్శబ్దంగా ఉండే ఓటర్ల నాడిని పట్టుకోవడం రాజకీయ పార్టీలకు అత్యంత కీలకం. వారి అభిప్రాయాలను అంచనా వేయడంలో విఫలమైతే అనూహ్య ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.







