ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. మంగళవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ప్రారంభమైంది.
తొలినుంచి వెలువడుతున్న సరళిలో అధికార కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. మధ్యాహ్నం 12.30 గంటల నాటికి అందిన సమాచారం ప్రకారం, 13 కార్పొరేషన్లలో ఎనిమిది చోట్ల కూటమి ఆధిక్యంలో ఉండగా, 53 మున్సిపాలిటీల్లో 47 చోట్ల ముందంజలో ఉన్నాయని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడించాయి. వైఎస్సార్సీపీ ఐదు మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ఇవి తుది ఫలితాలు కావు, అధికారిక ప్రకటనలతో లెక్కలు మారే అవకాశం ఉంది.
92 పట్టణ స్థానిక సంస్థల్లో కౌంటింగ్
రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందుకోసం 556 కౌంటింగ్ హాళ్లు, 6,831 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సిబ్బందిని నియమించారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
62.16 శాతం పోలింగ్ నమోదు
రీపోలింగ్ అనంతరం రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 96,89,061 మంది ఓటర్లకు గాను 60,22,411 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏకగ్రీవమైన స్థానాలు
13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లలో 118 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 3,020 వార్డుల్లో 637 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన స్థానాలకు జరిగిన పోటీలో అభ్యర్థుల భవితవ్యం కౌంటింగ్‌తో తేలనుంది.
విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి సహా ప్రధాన నగరాల్లో ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ పూర్తయ్యే కొద్దీ వార్డులు, డివిజన్ల వారీగా ఫలితాలు వెల్లడికానున్నాయి.












