అమెరికా నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వారానికి ఐదు రోజులు, రోజుకు 23 గంటల పాటు ట్రేడింగ్ ప్రారంభించనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సౌలభ్యం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
ప్రస్తుతం అమెరికా మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్ సమయాలతో పాటు పరిమిత ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ సదుపాయం ఉంది. కొత్త విధానం ద్వారా ఆదివారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు దాదాపు నిరంతరాయంగా ట్రేడింగ్ కొనసాగుతుంది. ప్రతిరోజూ ఒక గంట పాటు నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం ట్రేడింగ్ నిలిపివేస్తారు. ఈ విధానం అమలులో సైబర్ భద్రత, సాంకేతిక వ్యవస్థల పనితీరు, లావాదేవీల నిర్వహణ కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైబర్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజెస్ పేర్కొంది.
మరోవైపు నాస్డాక్ తన సాంకేతిక వ్యవస్థలను పరీక్షించడంతో పాటు సైబర్ భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అమెరికా ఈక్విటీ మార్కెట్లలో మరింత ఎక్కువ సమయం ట్రేడింగ్ చేసే అవకాశం లభించనుంది.




