విద్యార్థి దశలో మంచి అలవాట్లు అలవర్చుకుంటే భవిష్యత్తులో గొప్ప మార్పులు వస్తాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు కొంక రాజేశ్వర్ అన్నారు. సదాశివపేట పీఎం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థి దశ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైనదని, ఈ దశలో అలవర్చుకునే చిన్న మంచి అలవాట్లే భవిష్యత్తులో పెద్ద మార్పులకు నాంది పలుకుతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద అన్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలో సోమవారం వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కొంకా రాజేశ్వర్ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలవాట్లు ఎలా ఏర్పడతాయి, చెడు అలవాట్లను ఎలా విడనాడాలి, మంచి అలవాట్లను ఎలా అలవరుచుకోవాలి అనే అంశాలను విద్యార్థులకు వివరించారు. అలాగే టైమ్ మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, సెల్ఫ్ ఇమేజ్, స్టేజ్ ఫియర్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, భావోద్వేగ శ్రేయస్సు, మెమరీ టెక్నిక్స్ తదితర అంశాలపై విద్యార్థులతో ముఖాముఖి ప్రశ్నలు, సమాధానాల ద్వారా శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంక రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి పాఠశాల కుటుంబం మధ్య సమన్వయం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తేనే విద్యార్థుల్లో మంచి విలువలు, నైపుణ్యాలు పెంపొందించి సమాజానికి ఉత్తమ తరాన్ని అందించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జయసుధతో పాటు దేవి, సంగీత, గాయత్రి, దేవి కిషన్ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






