నారాయణఖేడ్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పాఠకులకు అందుతున్న సౌకర్యాలను కూడా ఆయన పరిశీలించారు.
ప్రస్తుతం గ్రంథాలయంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులకు రెండు నెలలపాటు కోచింగ్ కొనసాగుతోందని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుని, వాటిని మంజూరు చేయిస్తామని చైర్మన్ అంజయ్య హామీ ఇచ్చారు. గ్రంథాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్లు లలితాబాయి, అన్వర్ సుల్తానా, పాఠకులు గాంధీ, శ్రీనివాస్ రాథోడ్, నెహ్రు రాథోడ్, సాయికుమార్, సతీష్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.












