శ్రీపాద సాగర్ (ఎల్లంపల్లి) జలాశయం నుంచి బుధవారం మూడు గేట్లను ఎత్తి, దిగువన గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. నిమజ్జనం కోసం గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.5361 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 2,750 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా, 4,965 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 238 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 131 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గేట్లు ఎత్తినందున గోదావరిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.












