ఆర్టీసీలో కాంగ్రెస్ మద్దతుతో టీడబ్ల్యూయూ విజయం ఖాయమని, ఎన్నికల్లో బాణం గుర్తు దూసుకుపోనుందని ఆర్టీసీ జోనల్ ఇంచార్జ్ సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం మాట్లాడారు కార్మికుల సంపూర్ణ మద్దతును కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మంచిర్యాల డిపోలో టీడబ్ల్యూయూ విజయానికి సహకరించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, మెరుగైన అభివృద్ధి బాటలో పయనించేలా కార్యచరణ తీసుకుంటుందని, చిత్తశుద్ధితో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంచిర్యాలలో వేణుగోపాల్ చారి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పారదర్శకంగా పరిష్కరించడానికి ఇప్పటికే రెండు డీఏలను ప్రభుత్వం ప్రకటించిందని, మరొకటి దసరా, దీపావళి మధ్య ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఆర్టీసీలో 30 వేల మంది కార్మికులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని, వారసత్వ కారుణ్య ఉద్యోగాలు 1500 కల్పించిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. 1250 కోట్లతో విడుదల చేసి కార్మికుల సమస్యలను సీఎం పరిష్కరించారని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 16 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి ప్రభుత్వం జమ చేస్తూ, అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఆర్టీసీలో జరుగుతున్న మెరుగైన అభివృద్ధి కారణంగా, మంచిర్యాల డిపోలో టీడబ్ల్యూయూ విజయానికి సహకరించి, ప్రభుత్వ గెలుపుకు కృషి చేస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్పనిసరిగా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మధుకర్, సిటీ అధ్యక్షులు తూముల నరేష్, ఆర్టీసీ యూనియన్ సంఘం నాయకులు మంగళ దయానంద్, భీమేశ్వరరావు, తోట సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.











