మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో రాజకీయాలు రోజురోజుకు ముదురుతున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకల నుండే మొదలైన ఉద్రిక్తతలు, వరుస ఘర్షణలతో హై టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
తాళ్లపేటలో బతుకమ్మ ఆడే మహిళలపై లక్షింపేట సీఐ దాడి చేశారని నిరసిస్తూ మంతెన జగన్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి పలు డిమాండ్లు చేశారు. అనంతరం దసరా రోజు సాయంత్రం జగన్ వర్గానికి చెందిన ఆరుగురిపై, ఎమ్మెల్యే వర్గానికి చెందిన ముగ్గురిపై దాడి జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జగన్ ఇంటిపై ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. వర్గీయులు దాడి చేస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 200 మంది పోలీసులతో వన్-వే రహదారిని మూసివేసి, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రాళ్లవాగు కూడళ్ల వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఆ తర్వాత, ఎమ్మెల్యే అనుచరుడు, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ జగన్ వర్గంలో ప్రత్యక్షమై ఫోటోలు విడుదలయ్యాయి. మరుసటి రోజే అంకతి శ్రీనివాస్ ఎమ్మెల్యే దంపతులను కలవడం, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. ను అంకతి శ్రీనివాస్ సన్మానించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్షింపేటలో జరిగిన ప్రెస్ మీట్ లో మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ మధుకర్, అంకత్ శ్రీనివాస్ కిడ్నాప్ గురైనట్లు వెల్లడించారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తులు జగన్ బ్యాచ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కొద్ది వ్యవధిలోనే అంకతి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో రికార్డులను జగన్ వర్గం వైరల్ చేసింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ రాజకీయాలు శరవేగంగా మారుతూ, ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ గొడవలు మరింత ముదిరినట్లు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ హస్తం పార్టీ రాజకీయాలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.










