సంగారెడ్డి పట్టణంలోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో భరోసా, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు, మహిళలు, బాలికల భద్రత, పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా తదితర సంబంధిత ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. భరోసా సహాయకులు మహేశ్వరి మాట్లాడుతూ, మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. బాలికల భద్రత, హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ రాములు, ఎస్ఐ గోప్య నాయక్, ఏఎస్ఐ మహమూద్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ మహమూద్ అలీ, కళాశాల చైర్మన్ సూర్యకిరణ్, ప్రిన్సిపాల్ లక్ష్మణ్, వైస్ ప్రిన్సిపాల్ సభా ఫాతిమా, ఏఎన్ఎం శాలిని, అధ్యాపక బృందం, విద్యార్థులు, భరోసా సహాయకులు తదితరులు పాల్గొన్నారు.












