రామగుండం పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్ ఫేజ్-3' కార్యక్రమంలో భాగంగా జైపూర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఏ. భాస్కర్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన 'అరైవ్ అలైవ్ ఫేజ్-3' కార్యక్రమం కింద జైపూర్ సబ్ డివిజన్ పోలీసులు దుబ్బపల్లి ఫంక్షన్ హాల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే 'అరైవ్ అలైవ్' కార్యక్రమ లక్ష్యమని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రోడ్డు భద్రతపై తెలుసుకున్న విషయాలను ఇతరులకు తెలియజేయాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సీపీ స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వారి భవిష్యత్తు దృష్ట్యా ప్రమాదకరమని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డుపై నడిచే వారిని గమనిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు.
కనీస జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో రామగుండం కమిషనరేట్‌ను ప్రమాదరహిత ప్రాంతంగా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








