సంగారెడ్డి, 11 November
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో సినిమా రానుంది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను తెలుగు భాషలో సినిమాగా తెరకెక్కిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. సోనియా గాంధీ ఆత్మకథ బీ లాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం ఆధారంగా సినిమాను రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సోనియా గాంధీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలకు సినిమా ద్వారా పరిచయం చేయాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు. ఇందిరా గాంధీ కోడలిగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల తల్లిగా ఆమె సాగించిన జీవితాన్ని సినిమాలో చూపిస్తానని అన్నారు. సోనియా గాంధీది ఎంతో విజయవంతమైన రాజకీయ జీవితమని కొనియాడారు. దేశ రాజకీయాల్లో సోనియా గాంధీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం చేసిన ప్రాణత్యాగాలను ఆమె దగ్గరుండి చూశారని పేర్కొన్నారు. ప్రధాని పదవిపై సోనియా గాంధీకి ఎప్పుడూ వ్యామోహం లేదని, భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ పీవీ నరసింహారావుకు ఆ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఈ సినిమా నిర్మాణానికి సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరిస్తారని జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకోసం నాయకులు డబ్బులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సినిమా నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని ప్రకటించారు.







