రాయికోడ్, 11 November
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి మెరుగైన రేషన్ సేవలు అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు. ఆందోల్ నియోజకవర్గం మండలం సింగీతం గ్రామంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి మెరుగైన రేషన్ సేవలు అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు. ఆందోల్ నియోజకవర్గం మండలం సింగీతం గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు రేషన్ సేవలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కార్డుల్లో తొమ్మిది రకాల భద్రతా లక్షణాలు ఉన్నాయని, క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ సరుకుల లావాదేవీలను తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందేలా ఈ కార్డులకు వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కార్డులను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తోందని, ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల సన్న బియ్యం అందించడంతో పాటు అర్హులైన కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందుతున్నాయని తెలిపారు. మంత్రి దామోదర రాజనరసింహ నాయకత్వంలో ఆందోల్ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






