సంగారెడ్డి, 13 November
మహిళల్లో ఎదురయ్యే గైనకాలజీ సమస్యల చికిత్సలో రోబోటిక్ శస్త్ర చికిత్సలు, ఆధునిక వైద్య విధానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని యశోద హాస్పిటల్ సీనియర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ అనిత తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. గైనకాలజీ సమస్యలకు రోబోటిక్ సర్జరీ ద్వారా చిన్న కోతలతోనే శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అత్యాధునిక పరికరాలు, హైడెఫినిషన్ త్రీడీ కెమెరా సాంకేతికతతో వైద్యులు అత్యంత కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయగలరని వివరించారు. ఆపరేషన్ థియేటర్లోని ప్రత్యేక కన్సోల్ ద్వారా వైద్యులే రోబోటిక్ పరికరాలను నియంత్రిస్తారని, రోబోట్ స్వతంత్రంగా శస్త్రచికిత్స చేయదని ఆమె స్పష్టం చేశారు. గర్భాశయ ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్, కొన్ని రకాల గైనకాలజీ క్యాన్సర్లు, గర్భాశయ సంబంధిత సమస్యల చికిత్సలో ఈ విధానం ఉపయోగ పడుతుందని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో గర్భాశయాన్ని తొలగించే శస్త్ర చికిత్సలకు కూడా రోబోటిక్ సాంకేతికత దోహదపడుతుందని ఆమె తెలిపారు. చిన్న కోతల వల్ల రక్తస్రావం, శస్త్రచికిత్స అనంతర నొప్పి తగ్గడంతో పాటు ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గి, రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రతి మహిళకు రోబోటిక్ శస్త్రచికిత్స అవసరం ఉండదని, వ్యాధి తీవ్రత, ఆరోగ్య పరిస్థితులు, గతంలో జరిగిన శస్త్రచికిత్సలను పరిగణనలోకి తీసుకుని తగిన చికిత్సా విధానాన్ని ఎంపిక చేస్తామని ఆమె చెప్పారు. ముఖ్యంగా సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలకు గర్భాశయాన్ని సంరక్షించే చికిత్సలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. రోబోటిక్ సర్జరీతో పాటు ఆధునిక లాపరోస్కోపీ, హిస్టెరోస్కోపీ విధానాలు కూడా మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ఉపయోగపడుతున్నాయని ఆమె తెలిపారు. రోబోటిక్ శస్త్రచికిత్సల ప్రయోజనాలు, పరిమితులు, ఖర్చులు, ప్రత్యామ్నాయ చికిత్సలపై పూర్తి అవగాహన పొందిన తర్వాత వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ అనిత సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ గోపాల్ గౌడ్, తిరుమల్ పాల్గొన్నారు.







