మంచేరియల్, 14 November
మంచిర్యాల జిల్లాలో రాజకీయ పరిణామాలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించారు. దండేపల్లి, తాళ్లపేట ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కలిసిన ఆయన, కార్యకర్తలపై దాడులు, వేధింపులను సహించబోమని, నిరంకుశ ధోరణులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మంచిర్యాల అసెంబ్లీ లో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దండేపల్లి, తాళ్లపేట ప్రాంతాల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కలిసిన ఎంపీ స్థానిక రాజకీయ పరిస్థితులపై ఘాటుగా స్పందించారు.
కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా, వేధింపులకు గురిచేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలనలో నిరంకుశ ధోరణులకు తావు లేదని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలపై దాడులు, అన్యాయాలు జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
వంశన్న, వివేక్ అన్న అండగా ఉన్నప్పుడు కార్యకర్తలు ఎందుకు ఆందోళన చెందాలని ప్రశ్నిస్తూ, ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకుంటామని, న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతామని ధైర్యం నింపారు.
ఇటీవల మంచిర్యాలలో చోటుచేసుకున్న రాజకీయ విభేదాలు, దాడులు, వేధింపులు, పోలీసుల వ్యవహారశైలిపై ఎంపీ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కార్యకర్తల రక్షణ విషయంలో రాజీ పడేది లేదన్న వంశీకృష్ణ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించాయి.







