హైదరాబాద్, 14 November
మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో వర్గపోరు నేపథ్యంలో, మంతెన జగన్మోహన్ రావు హైదరాబాద్‌లో చేసిన రాజకీయ సందడి ఆసక్తికర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన గిగ్ వర్కర్ల సమావేశంలో జగన్ పాల్గొన్నారు.
మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో వర్గపోరు కొనసాగుతున్న వేళ మంతెన జగన్మోహన్ రావు హైదరాబాద్‌లో చేసిన రాజకీయ సందడి ఆసక్తికర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గిగ్ వర్కర్ల సమావేశంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెన్నంటే ఉంటూ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించారు.
అదేవిధంగా హైటెక్స్ పరిసరాల్లోని నోవాటెల్ హోటల్ వేదికగా 70 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు పాల్గొన్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలోనూ మంత్రి వెంట జగన్ ప్రత్యేక సందడి చేశారు. హైటెక్స్ పరిసరాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్లెక్సీలను ఏర్పాటు చేసి తన రాజకీయ ఉనికిని చాటుకున్నారు.
ఇటీవల మంచిర్యాలలో కాంగ్రెస్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో శుక్రవారం ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పర్యటన అనంతరం ఎంపీతో కలిసి హైదరాబాద్ చేరుకున్న మంతెన జగన్, శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒకవైపు ఎంపీ వంశీకృష్ణతో సాన్నిహిత్యం కొనసాగిస్తూనే, మరోవైపు మంత్రి వివేక్‌కు దగ్గరగా ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొనడం స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మంత్రి, ఎంపీల ఆశీస్సులు లభిస్తే మంతెన జగన్మోహన్ రావుకు పార్టీలో కీలక పదవి దక్కుతుందని స్థానిక నాయకులు భావిస్తున్నారు.







