సంగారెడ్డి, 16 November
సంగారెడ్డి జిల్లా మండలంలోని నుంచి మైకోడ్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని, దాని స్థానంలో నూతన వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వంతెనకు ఒకవైపు లోతైన సాగునీటి బావి, మరోవైపు నాలా ఉండటంతో ఏమాత్రం అజాగ్రత్త జరిగినా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మైకోడ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రహదారి మీదుగా చుట్టుపక్కల సుమారు 30 గ్రామాల ప్రజలు ప్రతిరోజూ ప్రయాణిస్తుంటారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా, జహీరాబాద్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, భారీ వాహనాలు సైతం ఇదే మార్గాన్ని వినియోగిస్తుండటంతో రాకపోకలు అధికంగా ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రమాదకర వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంచనాలు రూపొందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా తగిన నిధులు కేటాయించి, పరిపాలనా అనుమతులు మంజూరు చేసి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మరో ప్రాణనష్టం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.







