సంగారెడ్డి, 2026-08-12
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.
స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డితో కలిసి ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.