Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 27
అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన చోట సడలింపులు ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు పోటు రాంరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లయినా, అనేక గ్రామాలు సరైన రోడ్డు సౌకర్యం లేక విద్య, వైద్యం, అత్యవసర సేవలకు దూరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస రోడ్డు సౌకర్యం కల్పించేందుకు వన్ (సంరక్షణ ఏవం సంవర్ధన్) అధినియమ్ కింద అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన చోట తగిన సడలింపులు కల్పించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు పోటు రాంరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, అటవీ ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక విద్య, వైద్యం, అత్యవసర సేవలు, మార్కెట్లకు దూరంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే, అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
అటవీ అనుమతుల కారణంగా పెండింగ్లో ఉన్న గ్రామీణ రహదారి ప్రాజెక్టులను త్వరితగతిన పరిష్కరించాలని, కొంతవరకు పూర్తయి నిలిచిపోయిన రహదారి పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. తరతరాలుగా ప్రజలు వినియోగిస్తున్న బండి బాటలు, కచ్చా రహదారులను ప్రజా అవసరాల దృష్ట్యా అభివృద్ధి చేసేందుకు విధివిధానాలను సరళీకరించాలని విజ్ఞప్తి చేశారు.
“అడవి ఉండాలి… అడవిలో నివసించే ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి భంగం కలగకుండా, ప్రజల ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల నిర్మాణానికి ప్రత్యేక సడలింపులు లేదా సరళమైన అనుమతి విధానం తీసుకురావాలి” అని పోటు రాంరెడ్డి అన్నారు.
అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రహదారి, విద్య, వైద్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో స్పందించి, పెండింగ్లో ఉన్న రహదారి ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, అటవీ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు పోటు రాంరెడ్డి, చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారి ప్రసాద్, డీసీసీ సెక్రటరీ కొండు వెంకటేష్, కోటపల్లి బ్లాక్ ఇంచార్జ్ కుర్మా రాజమల్లా గౌడ్, కోటపల్లి మండల అధ్యక్షుడు కాట్రాల మల్లయ్య, మండల ఉపాధ్యక్షులు తోటపల్లి సుధాకర్ రెడ్డి, తోట అశోక్, బన్సీ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండలంలోని సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.












