శ్రీ హనుమ జీవితం నుండి మనం ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ధర్మం, స్నేహం, అహంకారం, విశ్వాసం వంటి అంశాలపై హనుమ బోధనలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. రావణుడు, వాలి వంటి పాత్రలతో పోల్చి చూస్తే, హనుమ జీవితం సరైన మార్గాన్ని ఎంచుకోవడం, అంకితభావంతో పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఎవరిని, దేనిని ఆశ్రయించాలో తెలుసుకోవడం జీవితంలో చాలా ముఖ్యం. ధర్మం తెలిసిన బ్రాహ్మణుడైన రావణుడు, అపారమైన శివ భక్తుడైనప్పటికీ, పరస్త్రీల యందు, పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు. చివరకు శ్రీ రాముని ఒక్క బాణంతో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మమూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి, ఆయన మార్గంలో నడిచిన స్వామి హనుమ చిరంజీవిగా, చరిత్రలో నిలిచిపోయారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో, దేన్ని విడిచిపెట్టాలో తెలియాలి. సరైన మార్గాన్ని తెలుసుకోవడమే కాదు, దానిని పాటించే ధైర్యం కూడా ఉండాలి.
మైత్రి విలువను కూడా హనుమ జీవితం తెలియజేస్తుంది. వంచనతో, బలంతో భార్యను, భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలికి హనుమ మంత్రిగా ఒక్కనాడూ లేరు. తన దారి తానూ చూసుకోలేదు. న్యాయం వైపుగా సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి ఉన్నారు. జీవితంలో కష్టాలు, సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు, వాళ్ళని ఎన్ని కష్టాలొచ్చినా విడిచిపెట్టకూడదు.
అహంకారం వీడాలి
నేనే గొప్ప అని అనుకోకూడదు. నాదేం లేదు అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి. లంకకు వెళ్ళే ముందు హనుమ ఇలా అంటారు: నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి, వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకోగలను. అంత బలం ఉంది. కాని నేను ఎలా వెళ్తానో తెలుసా నా స్వామి రామచంద్రమూర్తి తన కుడిచేత్తో, భుజం వెనుకనున్న అక్షయ బాణ తూణీరం నుండి తీసిన బాణాన్ని ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి, ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో, అలా దూసుకెళ్తాను. అది నా శక్తి కాదు. రాముడి చే విడవబడితే, రాముడి శక్తి ఆ బాణంలోకి వెళ్లి బాణం వెళుతుంది. అటువంటి రామ బాణంలా వెళ్తాను - నేను, నా వల్ల, నా బలం.. ఇదంతా నేనే చేశాను.. అని హనుమ ఒక్కసారి కూడా అనలేదు.
విశ్వాసం ముఖ్యం
నీ మీద నమ్మకం ఉండేలా బ్రతకాలి. కొన్ని లక్షల వానర సైన్యం, నూరు యోజనముల సముద్రం, జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు ఉన్నప్పటికీ, రాముడు నమ్మింది, అందరూ సూచించింది హనుమనే నిన్ను నమ్మి పని అప్పగించి, గుండెలపై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతకాలి.
అడ్డంకులను అధిగమించడం
మోసం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు మోసపోకు, ఆగిపోకు. ముందుకు మరో అడుగేసి సాగిపో హనుమ సముద్రం దాటుతూ ఉండగా, ఒక అందమైన బంగారు పర్వతం పైకి లేచింది. స్వామి, మీరు చాలా దూరం ప్రయాణం చేసి అలసి ఉన్నట్టు కనబడుతున్నారు కాసేపు నా ఈ పర్వతంపై కూర్చుని, విశ్రాంతి తీసుకుని, ఇక్కడ ఉన్న పళ్ళు, కాయలు తిని వెళ్ళండి అని అంటుంది. హనుమ, సముద్రంలో బంగారు పర్వతమా మాయలా ఉంది ఇది నాకు విఘ్నమని ఆలోచించి, ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి, లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు. చేసే పనిలో, గమ్యాన్ని చేరుకోవడంలో ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ చేసుకున్న ప్రమాణం. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.












