జన్నారం మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో కానిస్టేబుల్ కోడిజుట్టు శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
లక్షెటిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్, జన్నారం మండల కేంద్రంలో బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఆయన తలకు, మెడకు గాయాలయ్యాయి.
స్థానిక పోలీసులు వెంటనే శ్రీనివాస్‌ను లక్షెటిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఉన్నత వైద్యం కోసం హైదరాబాదులోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు జన్నారం ఎస్సై జి.ఉదయ్ కిరణ్ తెలిపారు.
కానిస్టేబుల్ శ్రీనివాస్ మంచిర్యాల డిసిపి భాస్కర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.











