సంగారెడ్డి, 2026-11-25
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నిర్మల దంపతుల తనయుడు సాయి భరత్ రెడ్డి, పాలక్ల వివాహ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదానంలో బుధవారం సాయి భరత్ రెడ్డి, పాలక్ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సాయి భరత్ రెడ్డి, పాలక్లకు పుష్పగుచ్ఛం అందించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రాకతో వివాహ వేడుక ప్రాంగణం సందడిగా మారింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.






