కరీంనగర్ నగరంలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షోరూం చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీ మొత్తంలో దొంగిలించబడిన ఆభరణాలతో పాటు ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, దొంగలు నగలు దోచుకున్న అనంతరం మహారాష్ట్ర మీదుగా పశ్చిమ బెంగాల్‌కు పారిపోయారు. బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చోరీకి బీహార్‌కు చెందిన సుబోద్ సింగ్ అలియాస్ 'ది గోల్డెన్ థీఫ్' సూత్రధారిగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ దొంగతనంలో మొత్తం ఐదుగురు నేరుగా పాల్గొన్నారని, వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 13 మంది ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీరిలో సుబోద్ సింగ్‌తో పాటు మరో 10 మంది పరారీలో ఉన్నట్లు సమాచారం.
అరెస్ట్ అయిన నిందితుల నుంచి పిస్టల్స్, దొంగతనం కోసం ఉపయోగించిన వాహనాలు, భారీ మొత్తంలో బంగారు, వజ్రాల ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించబడిన ఆభరణాల విలువను అంచనా వేస్తున్నారు.











