జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భూమేష్ పాల్గొని, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రౌడీషీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై భూమేష్ పాల్గొని రౌడీషీటర్లకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజల్లో భయాందోళనలు సృష్టించే చర్యలు, గొడవలు, బెదిరింపులు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని, కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమాజంలో మంచిపేరు సంపాదించుకునేలా జీవించాలని సూచించారు.
నేరప్రవర్తన వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. యువత చెడు స్నేహాలకు, మద్యం మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతియుత వాతావరణం కోసం పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.











