మంచిర్యాల సిమెంట్ కంపెనీ (MCC) భవితవ్యంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో, హింద్ మజ్దూర్ సభ (HMS) జిల్లా కమిటీ కీలక డిమాండ్లను ముందుకు తెచ్చింది. కంపెనీని నష్టాల్లోకి నెట్టి, విలువైన భూములను రియల్ ఎస్టేట్ కుట్రలకు వాడుకోవాలనే ప్రయత్నాలను అడ్డుకోవాలని, ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడపాలని HMS కోరింది.
HMS జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణ మాట్లాడుతూ, "కంపెనీని కావాలనే నష్టాల్లోకి నెట్టి, దాదాపు 438 ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగించాలనే కుట్రలను ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలి. ఈ భూములపై ఎటువంటి లేఅవుట్లు, వెంచర్లు లేదా వాణిజ్య అనుమతులు ఇవ్వకూడదు" అని అన్నారు.
వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని, ప్లాంట్ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభించాలని HMS కోరుతోంది. పరిశ్రమ పునరుద్ధరణ ద్వారా స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొంది.
అలాగే, గతంలో పనిచేసిన కార్మికుల జీతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి బకాయిలను తక్షణమే చెల్లించాలని, బ్యాంకు వేలం ద్వారా వచ్చే మొత్తంలో కార్మికుల బకాయిలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసింది. నిరుద్యోగులను విదేశాలకు పంపుతామని చెప్పే పాలకులు, మూతపడుతున్న పరిశ్రమలను కాపాడటంలో ఎందుకు విఫలమవుతున్నారని HMS నాయకులు ప్రశ్నించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, కార్మిక శాఖ మంత్రి వెంటనే స్పందించి, కార్మిక సంఘాలతో సమీక్ష నిర్వహించి, ప్లాంట్ పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్లాంట్ను ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరుద్ధరించే చర్యలు చేపట్టకపోతే, HMS ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్మికులు, నిరుద్యోగ యువత, ప్రజాసంఘాలను ఏకం చేసి భారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి షఫీ, పట్టణ నాయకులు దున్నపోతుల రమేష్, పల్లపు శ్రీనివాస్, పురాణపు క్రాంతి, అనంతుల మహేష్, ఎండి అలీ, చల్ల సురేష్, ఎండి షాహిద్ తదితరులు పాల్గొన్నారు.








