హైదరాబాద్, 2026-08-27
వశవఎషఎొవ08వధడషవఅ
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ను రాజకీయంగా శక్తివంతం చేస్తామని, రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని, 2028లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. మంచిర్యాల అసెంబ్లీ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు టీటీడీ కల్యాణ మండపంలో ఉచిత శిక్షణ, భోజన వసతులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 2 లక్షల 80 వేల ఓట్లలో 60 వేలకు పైగా తొలగించినట్లు అధికారుల ద్వారా తెలిసిందని ఆయన చెప్పారు. దీంతో నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2 లక్షల 20 వేలకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. మరో నెల రోజుల పాటు అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో చేర్చుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మంచిర్యాల రాజకీయాల్లో తనకు ఎదురులేదని, ప్రతిపక్షాలకు ఆరోపణలు చేయడం తప్ప వాటిని నిరూపించుకునే సత్తా లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దమ్ముంటే ఆధారాలు, సాక్ష్యాలతో బహిరంగ చర్చకు రావాలని, పదేపదే ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి పూర్తిస్థాయి కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, లక్షెట్టిపేటలో ఆసుపత్రి, ఉన్నత పాఠశాల దీనికి నిదర్శనమని తెలిపారు. మంచిర్యాలలో 650 పడకల ఆసుపత్రి, మార్కెట్ యార్డులో 350 పడకల ఆసుపత్రి నిర్మాణంతో జిల్లా కేంద్రంలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో వస్తాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ను బలోపేతం చేసి, ప్రజల కోసం, ప్రజల చేత ముందుకు సాగడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నానని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో గురువారం రాత్రి మాట్లాడారు.












