నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ అవసరమని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నారు. శనివారం ఆయన మందమర్రి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పలు కీలక సూచనలు చేశారు.
మందమర్రి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ. భాస్కర్, పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, రిసెప్షన్ సెంటర్ రికార్డులను పరిశీలించి, నమోదవుతున్న కేసుల వివరాలు, నేరాల స్వభావం, కేసుల పురోగతిపై ఆరా తీశారు.
రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అత్యవసరమని, నిరంతర పెట్రోలింగ్‌తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి, మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న డీసీపీ, స్టేషన్ పరిధికి సంబంధించిన వివిధ అంశాలను సీఐ రమేష్ నుండి తెలుసుకున్నారు. ఈ తనిఖీలలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్, ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు.
ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను పరిరక్షించవచ్చని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని డీసీపీ తెలిపారు.











