20 నవంబర్ 26 అక్షరవేకువ (అక్షరవేకువ) నవంబర్ 20
మంచిర్యాల పట్టణంలో ఇంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్లింత్ ఏరియా ధ్రువపత్రం పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
మంచిర్యాల పట్టణంలో ఇంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్లింత్ ఏరియా ధ్రువపత్రం పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మున్సిపల్, పంచాయతీ అధికారుల నుంచి ఇంటి నిర్మాణ విస్తీర్ణానికి సంబంధించిన ధ్రువపత్రం తీసుకురావాలనే నిబంధనను కొందరు వసూళ్లకు అవకాశంగా మలుచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధ్రువపత్రం జారీకి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నకిలీ పత్రాల వ్యవహారం
ఇంటి రిజిస్ట్రేషన్లకు ప్లింత్ ఏరియా ధ్రువపత్రం తప్పనిసరి చేసిన నేపథ్యంలో కొందరు మున్సిపల్ ఉద్యోగులు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈ అక్రమాలకు సంబంధించి కొందరు ఉద్యోగులు జైలుపాలైనట్లు సమాచారం. నకిలీ పత్రాలతో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయన్న అంశంపై సమగ్ర విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
కలెక్టర్ ఆదేశాలు
మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్లకు సైతం రిజిస్ట్రేషన్లు జరిగిన విషయాన్ని కలెక్టర్ గుర్తించిన నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 2024 డిసెంబరులో ఇంటి నిర్మాణ విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి వివరాలతో ప్లింత్ ఏరియా ధ్రువపత్రం తీసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అదనపు వసూళ్ల ఆరోపణలు
ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని ధ్రువపత్రాల జారీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంటి స్థలం, ఇంటి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే ప్రజల నుంచి అదనంగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారా ధ్రువపత్రాల జారీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందా ఫోర్జరీ ధ్రువపత్రాల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






