మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 27
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కోతులు, వీధి కుక్కల బెడద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. సుమారు రెండు లక్షల జనాభా కలిగిన మంచిర్యాల నగరంలోని 60 డివిజన్లలో వానరాలు, శునకాల స్వైర విహారం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కాలనీలు, నివాస ప్రాంతాలు, వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, పండ్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్తుండటంతో మహిళలు, గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల మధ్యలోనే కోతులు సంచరిస్తూ తరచూ దాడులకు దిగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు విక్రయించే అరటిపండ్లు, యాపిల్స్, ద్రాక్ష వంటి పండ్లను కోతులు ఎత్తుకెళ్తుండటంతో వ్యాపారులకు ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయి.
ఇదిలా ఉండగా వీధి కుక్కల బెడద కూడా నగరంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ వాహనదారులకు అడ్డుపడటమే కాకుండా, ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చిన్నారులు, పాదచారులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్న ఘటనలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. కుక్కల గుంపుల సంచారంతో కాలనీల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతులు, వీధి కుక్కలను నియంత్రించాల్సిన సంబంధిత శాఖలు, కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తక్షణమే స్పందించి, ఈ జంతువుల బెడదను అరికట్టేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



