సంగారెడ్డి, 2026-08-22
ఎంఎన్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యం తమకు అన్యాయం చేస్తోందని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను ఆశ్రయించారు. అడ్మిషన్ సమయంలో చెప్పిన ఫీజు చెల్లించిన తర్వాత, ఇప్పుడు మరో రూ.2 లక్షలు కట్టాలని యాజమాన్యం డిమాండ్ చేస్తోందని వారు ఆరోపించారు.
ఎంఎన్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యం తమకు అన్యాయం చేస్తోందని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను ఆశ్రయించారు. విద్యార్థులను ఎంఎన్ఆర్ లో చేర్పించే సమయంలో యాజమాన్యం చెప్పిన విధంగానే ఫీజు చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నామని తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు వివరించారు. అయితే నెల రోజుల పాటు తరగతులు నిర్వహించిన అనంతరం తమ విద్యార్థుల సర్టిఫికెట్లు ఫేక్ అని యాజమాన్యం పేర్కొంటోందని వారు ఆరోపించారు.
ఈ విషయంపై విద్యార్థులు యాజమాన్యాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బందితో బయటకు పంపించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విద్యార్థులు తిరిగి విద్యాసంస్థలో కొనసాగాలంటే మరో రూ.2 లక్షల ఫీజు చెల్లించాల్సిందేనని, లేదంటే విద్యా సంస్థలోకి అనుమతించబోమని యాజమాన్యం చెబుతోందని తల్లిదండ్రులు ఆరోపించారు. అడ్మిషన్ సమయంలో పూర్తి ఫీజు వివరాలను తెలుసుకుని, యాజమాన్యం సూచించిన విధంగానే ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ రూ.2లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో తమ పిల్లల చదువుకు నష్టం కలగకుండా న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.
వారి సమస్యను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వెంటనే ఎంఎన్ ఆర్ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు అన్యాయం జరగకూడదని, వారి విద్యకు ఆటంకం కలగకుండా సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఎంఎన్ ఆర్ యాజమాన్యం తనను కలవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యను పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు.










