రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో భారీగా డబ్బులు దండుకుంటూ, విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ (NSF) రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ పటేల్ ఆరోపించారు. విద్య ఒక హక్కు అని, వ్యాపారం కాదని ఆయన అన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో NSF ఆధ్వర్యంలో 'కార్పొరేట్ హఠావో, బడ్జెట్ పాఠశాల బచావో' పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పటేల్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల రక్తాన్ని ఫీజుల రూపంలో దోచుకుంటున్నాయని, ఆ డబ్బులతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తూ పదవులు చేజిక్కించుకుంటున్నారని విమర్శించారు.
ఒకే అనుమతితో ఏసీ, ఐఐటీ, నీట్ వంటి వివిధ పేర్లతో క్యాంపస్లు నడుపుతూ, విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని, అడ్మిషన్ ఫీజుతో పాటు, ప్రతి సంవత్సరం విద్యార్థికి వేల నుంచి లక్షల రూపాయల వరకు వివిధ రూపాల్లో వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ డబ్బులతో పదవులు కొనుక్కోవాలనే దుర్భుద్ధితో విద్యాసంస్థలను వ్యాపారంగా నడుపుతున్నారని అన్నారు.
పుస్తకాలు, యూనిఫామ్స్ వంటివి అమ్ముకుంటూ విద్యాసంస్థలను వ్యాపార సంస్థలుగా మార్చారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల దోపిడీ ఆపకపోతే, మంచిర్యాల జిల్లా నుండే వారి పతనం ప్రారంభమవుతుందని NSF హెచ్చరించింది. ప్రభుత్వ పెద్దల అండతో తమను ప్రశ్నించేవారిపై కేసులు పెట్టిస్తామని బెదిరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలను నడపాలని, లేనిపక్షంలో అలాంటి వారిని మంచిర్యాలలో బొందపెడతామని హెచ్చరించారు.











