సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని, కోలిండియా హైపవర్ కమిటీ వేతనాలు, బకాయిలను చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (SCKIS - CTU) డిమాండ్ చేసింది. ఈ మేరకు మందమర్రిలో కాంట్రాక్ట్ కార్మికులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలపై చర్చించింది.
సంఘం నాయకులు సంకె రవి, దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వతం చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు, ప్రస్తుతం వారి వేతన బకాయిలను కూడా చెల్లించడం లేదని ఆరోపించారు.
పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ, కాంట్రాక్ట్ కార్మికులను వివక్షతో చూస్తున్నారని, వారిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న హైపవర్ కమిటీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని, కార్మికులందరూ సంఘటితమై సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బచ్చలి సురేందర్ తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.












