శ్రీ పశుపతినాథ్ దేవస్థానం ఆలయ అర్చకులు, ధూపదీప నైవేద్య సంఘం ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ మండల అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో, రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ త్రైత శకం 48 కాలసూచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని, త్రైత సిద్ధాంతాన్ని విశదీకరించారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్బాపూర్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు 1978లో స్థాపించిన ప్రబోధాశ్రమం నుండి త్రైత శకం ప్రారంభమైందని, ప్రస్తుత శ్రీ పరాభవ నామ సంవత్సరంతో ఇది 48వ సంవత్సరంలోకి ప్రవేశించిందని తెలిపారు. యోగీశ్వరులు సమాజానికి శాస్త్రబద్ధమైన ఆత్మజ్ఞానాన్ని అందించడానికి త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని వివరించారు.
త్రైత సిద్ధాంతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం వంటి సిద్ధాంతాలకు భిన్నంగా, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనే మూడు ఆత్మలపై ఆధారపడి ఉంటుందని సిద్ధాంతి పేర్కొన్నారు. యోగీశ్వరులు రచించిన “త్రైత సిద్ధాంత భగవద్గీత” గ్రంథం శ్రీకృష్ణుని నిజ భావాన్ని వివరిస్తూ విశిష్ట స్థానం సంపాదించిందని ఆయన తెలిపారు. భగవద్గీతతో పాటు ఇతర దైవగ్రంథాలలోని జ్ఞానం ఏకరూపమైందని, ప్రజలు కులమతాలకు అతీతంగా వాటిని అధ్యయనం చేయాలని యోగీశ్వరులు బోధించారని చెప్పారు.
బ్రహ్మ, కర్మ, భక్తి యోగాలపై వివరణలతో పాటు, ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడించే 100కు పైగా గ్రంథాలు, 200కు పైగా ప్రవచనాలను యోగీశ్వరులు సమాజానికి అందించారని పేర్కొన్నారు. “తెలుగు భాష దైవ భాష” అని ప్రకటిస్తూ, తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఆయన విశేష కృషి చేశారని తెలిపారు. ఆధ్యాత్మిక రంగంలో 100కు పైగా గ్రంథాలను రచించిన ఏకైక వ్యక్తిగా యోగీశ్వరులను గుర్తిస్తూ, ఆయన నిర్మించిన ప్రబోధాశ్రమం మరియు సేవలను “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్”లో నమోదు చేసి సత్కరించినట్లు చెప్పారు.
మన పండుగలు గ్రంథం ద్వారా యుగాది పండుగ విశిష్ఠతను వివరించిన యోగీశ్వరులు, యుగాది నుండి ప్రకృతి, గ్రహాల ప్రభావం, మనిషి జీవనంలో మార్పులు సంభవిస్తాయని తెలిపారు. తెలుగు మాసాలు, తిథులతో కూడిన కాలసూచికను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా హింగే భాస్కర్ మాట్లాడుతూ, సరళమైన తెలుగు భాషలో రూపొందించిన ఈ క్యాలెండర్ ప్రతి ఒక్కరికీ ఉపయోగంగా ఉంటుందని కొనియాడారు.










