బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రణాళిక సిద్ధం చేశామని మాజీ సినీ ఫోటోగ్రఫీ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు తెలిపారు. రాబోయేది గులాబీ రాజ్యమేనని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల సమస్యలు, వడ్ల కొనుగోలు, మొక్కజొన్నల కొనుగోలు వంటి అంశాలపై నిరసనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన తవ్వకాలను పూర్తి చేయాలని, లేని పక్షంలో వాటిని పూడ్చివేయాలని సూచించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, స్త్రీ సంక్షేమ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఎడ్ల శంకర్, ఎండి తాజ్, పలువురు మహిళా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రామ్మోహన్ రావును మంచిర్యాల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.








