మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని, అభ్యంతరకర పోస్టర్ల వ్యవహారాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారని మహాసభ నాయకులు ఆరోపించారు.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య మంగళవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈటెల రాజేందర్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఈటెల రాజేందర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రచారాలు తెరలేపడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మహాసభ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.
అభ్యంతరమైన పోస్టర్లు అతికించిన వారిని నిఘా నేత్రాల ఆధారంగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను వారు కోరారు. ఈటెలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఇటువంటి కుట్రలను ఐక్యంగా తిప్పుకొట్టాలని వారు పిలుపునిచ్చారు.
ఈటెల రాజేందర్ ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడని, ఇలాంటి దుష్ప్రచారాలు ఆయన ప్రజాదరణను ఏమాత్రం తగ్గించలేవని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












