ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ (కామన్ కాజ్ ఫర్ జస్టిస్ అండ్ పీస్) నిర్వహించిన నిరసనతో ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతం సందడిగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ వేలాది మంది హాజరయ్యారు.
సాయంత్రం 4 గంటల సమయంలో సుమారు 9,000 నుంచి 10,000 మంది వరకు అక్కడ ఉన్నట్లు ముంబై పోలీసుల ప్రత్యేక విభాగం అంచనా వేసింది. నిరసన ప్రాంగణంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రైకలర్ జెండాలు, ప్లకార్డులతో వచ్చిన యువత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వ్యంగ్య సందేశాలు, పోస్టర్లు, సినిమా డైలాగులు కూడా నిరసనలో కనిపించాయి. గాంధీ జయంతి సందర్భంగా అహింస, సరళతకు సంబంధించిన సందేశాలు కూడా వేదికపై ప్రదర్శించారు. పోలీసులు పరిస్థితిని కట్టడి చేయడానికి బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, నిరసన ప్రధానంగా ప్రశాంతంగానే సాగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య పెద్దగా ఉద్రిక్తత చోటుచేసుకోలేదని పేర్కొంది. అయితే నిరసన ముగిసిన తర్వాత దాదర్‌లోని శివసేన భవన్ సమీపంలో కొందరు సీజేపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా, నిరసనకు వచ్చిన ఓ 75 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందినట్లు ముంబై పోలీసులు తెలిపినట్లు ఎన్డీటీవీ నివేదించింది. ఈ ఘటనపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.











