నేషనల్ హైవే 63 రహదారి అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మార్పు వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపిస్తూ, ఎంపీ గడ్డం వంశీ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆర్మూర్-మంచిర్యాల మధ్య NH 63 అభివృద్ధికి నిధులు విడుదల చేసిందని తెలిపారు. గతంలో ఆమోదించిన బ్రౌన్ఫీల్డ్ అలైన్మెంట్ను మంత్రి వివేక్ వెంకటస్వామి తన పలుకుబడితో గ్రీన్ఫీల్డ్గా మార్చడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులైన రైతులు, ఈ రోడ్డు మార్పుతో మరింత ఇబ్బందులు పడుతున్నారని, ఇది మంత్రి స్వార్ధ ప్రయోజనాల కోసమే జరిగిందని విమర్శించారు. అధికారులు, స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో ఢిల్లీలో అధికారులను కలిస్తే, స్థానిక ప్రజాప్రతినిధుల అనుమతితో పాత అలైన్మెంట్తో రోడ్డు నిర్మిస్తామని చెప్పినట్లు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సానుకూలంగా స్పందించినా, ఎంపీ గడ్డం వంశీ స్పందించకపోవడం, రైతులకు మద్దతుగా లేఖ ఇవ్వకపోవడం పట్ల మధుసూదన్ రావు విచారం వ్యక్తం చేశారు. ఎంపీ వంశీ వెంటనే కేంద్రమంత్రితో మాట్లాడి, బ్రౌన్ఫీల్డ్ అలైన్మెంట్లోనే రోడ్డు నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. లేదంటే, తండ్రీకొడుకులపై చరిత్రలో చెరగని మచ్చ పడుతుందని హెచ్చరించారు.
రేపు మంచిర్యాలకు వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ సమస్యపై జోక్యం చేసుకుని, రైతులకు అండగా నిలబడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోరే పార్టీ అని చెప్పుకుంటూ, గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ను మార్చి, బ్రౌన్ఫీల్డ్ అలైన్మెంట్గా రోడ్డు నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు.










