తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణ కోసం గొంతెత్తుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో, రాష్ట్ర హక్కులకు భంగం కలిగిన సందర్భాలలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత, ప్రజలు ప్రాణత్యాగాలు చేసినప్పుడు, తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు వచ్చినప్పుడు, రాష్ట్ర హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణను అవమానించిన వారితోనే రాజకీయ పొత్తులు పెట్టుకుని, తెలంగాణకు అన్యాయం చేసిన శక్తులతోనే కలిసి నడుస్తూ, ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకమని ఆయన విమర్శించారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ఎంపీ వంశీకృష్ణ నిలదీశారు. తెలంగాణ యువత, తెలంగాణ ఆత్మగౌరవం అవమానించబడిన ప్రతి సందర్భంలో మౌనం పాటించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు రక్షకుడిలా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
"తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణ హక్కులను కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీయే" అని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ పేరు ఉపయోగించే వారిని తెలంగాణ ప్రజలు ఎన్నడూ నమ్మరని, మాటలు కాదు చేతలే ముఖ్యం అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడదని, తెలంగాణ హక్కుల కోసం ఎప్పటికీ ముందుండి పోరాడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ పేరును వాడుకునే వారిని ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు.











