సంగారెడ్డి, 2026-08-14
సంగారెడ్డిలో శనివారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. లక్ష మందితో సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
సంగారెడ్డిలో శనివారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సభ ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డితో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సభ విజయవంతం కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామిలతో ప్రతి రోజూ సమీక్షిస్తున్నామని చెప్పారు.
సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీల విగ్రహాలను ఆవిష్కరించనున్నారని తెలిపారు. సీఎం సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచే సుమారు 50 వేల మంది హాజరవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చిందని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఐదు లక్షల మందికి అందించనుందని తెలిపారు.
సభకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, నాయకులు కిరణ్ గౌడ్, కూన సంతోష్, షఫీ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.











