చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆరోపిస్తూ, బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
శనివారం, మంచిర్యాలలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని, దీనికి నిరసనగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. అయితే, పోలీసులు భారీ బందోబస్తుతో వారిని అడ్డుకున్నారు.
పోలీసులు అడ్డుకోవడంతో, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జోగుల శ్రీదేవి మాట్లాడుతూ, గతంలో మహిళా బిల్లు చట్టంగా మారకుండా కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు అడ్డుకుందని ఆరోపించారు. 1996, 1998, 1999, 2002, 2003 సంవత్సరాలలో బిల్లును ముందుకు తీసుకువచ్చినా, కాంగ్రెస్ మద్దతు లభించలేదని విమర్శించారు.
2010లో యూపీఏ ప్రభుత్వానికి బీజేపీ మద్దతిచ్చినా, లోక్సభలో కాంగ్రెస్ బిల్లును అడ్డుకుందని ఆమె గుర్తు చేశారు. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బిల్లును ఆమోదింపజేసినా, కాంగ్రెస్ కేవలం నామమాత్రపు మద్దతు మాత్రమే ఇచ్చిందని, 2026 జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమలులోకి వస్తుందని, దీనివల్ల 2034 లేదా ఆ తర్వాతకు వాయిదా పడే అవకాశం ఉందని అన్నారు. అయితే, 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలని స్పష్టం చేయడం ద్వారా కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ నిజంగా అమలులోకి వచ్చే సమయంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బిల్లును అడ్డుకొని తమ వక్రబుద్ధిని ప్రదర్శించాయని శ్రీదేవి తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్, జిల్లా నాయకులు బేర సత్యనారాయణ, పచ్చ స్వప్న, మెతె సుజాత, మంద స్వాతి, సురచి స్వాతి, శ్రీ రాంపూర్ మహిళ మోర్చా జిట్టవేని రేణుక, శ్రీరాంపూర్ జంక్షన్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు బొంగోని శిరిష, గర్మిళ్ల జోన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు బైరం లక్ష్మి, పద్మ, మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు, సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, ప్రధాన కార్యదర్శులు పొన్నవేని సదయ్య, చిరంజీవి, బద్రి శ్రీకాంత్, రమణ వేణి శ్రీనివాస్, నేరేడుగొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







