తెలంగాణ వీరవనిత, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు నేటికీ ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఆమె చూపిన ధైర్యం, ఆత్మగౌరవం తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, ఎస్బీ ఎస్ఐలు, డీపీఓ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.











