పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీజీఎస్పీ 13వ పోలీసుల ఆధ్వర్యంలో సంగీత నివాళి కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గుడిపేటలోని టీజీఎస్పీ 13వ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పోలీసుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడమే ఈ సంగీత నివాళి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పోలీస్ బ్యాండ్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా దేశభక్తి గేయాలతో పాటు అమరుల త్యాగాలను కీర్తిస్తూ, వివిధ రకాల వాయిద్యాలతో విన్యాసాలు ప్రదర్శించారు. శ్రావ్యమైన సంగీతం, విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశం, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషిని, త్యాగాలను కళ్ళకు కట్టినట్లు గేయాల ద్వారా వినిపించారు. ఈ సంగీత నివాళి కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, ఆర్ఐలు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.












