స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా దేశానికి విశేష సేవలందించారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఉన్న 565 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి, దేశ ఐక్యతకు పునాదులు వేశారని పేర్కొన్నారు. ఆయన దృఢమైన నాయకత్వం, పట్టుదలతో దేశాన్ని ఐక్యంగా నిలపడంలో కీలక పాత్ర పోషించారని, అందుకే ఆయనను భారత ఉక్కు మనిషి, భారత బిస్మార్క్ అని గౌరవంగా స్మరించుకుంటామని ఎస్పీ తెలిపారు. 1928లో గుజరాత్‌లోని బార్డోలీలో రైతులపై విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమానికి వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించి, రైతులను ఏకం చేసి అహింసా మార్గంలో ఉద్యమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలను మెచ్చిన మహాత్మా గాంధీ ఆయనకు సర్దార్ అనే బిరుదును ప్రదానం చేశారని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు తెలంగాణతో కూడా ప్రత్యేక అనుబంధం ఉందని ఎస్పీ తెలిపారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, అప్పటి హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢమైన నిర్ణయాలు, చర్యల ఫలితంగా 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తు చేశారు.
వందలాది సంస్థానాలను ఏకం చేసి ఐక్య భారతదేశ నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడికి ఘన నివాళులర్పిస్తూ, జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడటం, సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించడం, మాతృభూమి సేవకు అంకితభావంతో పని చేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్, డానియోల్, శ్రీనివాస్ రావు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


