ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 13వ తేదీన మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాను సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో సింగరేణి సంస్థ అధికారులు విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నారు.
డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా, శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని పలు భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను కూడా ఆయన సందర్శించే అవకాశం ఉంది. ఇందుకోసం అవసరమైన సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి.
ఈ పర్యటనలో సుమారు 400 మంది లబ్ధిదారులకు కారుణ్య నియామక పత్రాలను అందించే అవకాశం ఉందని సమాచారం. అయితే, మారుపేరు అంశంపై కార్మికులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సూచనప్రాయంగా సుముఖత వ్యక్తం చేసినా, అది ఇంకా అమల్లోకి రాలేదని కార్మికులు పేర్కొంటున్నారు.
డిప్యూటీ సీఎం ఆకస్మిక పర్యటన వెనుక గల కారణాలపై కార్మికవర్గంలో ఆసక్తి నెలకొంది. ఈ పర్యటన సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వేచి చూడాలి.
ప్రస్తుతం సింగరేణి జీఎం శ్రీనివాస్, ఇతర అధికార యంత్రాంగం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.












