జలియన్ వాలాబాగ్ హత్యాకాండలో అమరులైన వారికి సోమవారం మందమర్రి పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్, సింగరేణి ఉద్యోగి రాజేష్ పిహ్వల్, రాణి పిహ్వల్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.
రాజేష్ పిహ్వల్ మాట్లాడుతూ, 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ హత్యాకాండ భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఒక మరపురాని విషాద ఘట్టమని, నిరాయుధ ప్రజలు తమ ప్రాణాలను అర్పించడం దేశ స్వేచ్ఛ కోసం చేసిన అత్యున్నత త్యాగానికి నిదర్శనమని అన్నారు. ఈ రోజు మనం ఆ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని పేర్కొన్నారు.
రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా సమావేశమైన ప్రజలపై, ఎలాంటి హెచ్చరిక లేకుండా జరిగిన ఈ దారుణం, బ్రిటిష్ పాలన యొక్క క్రూరత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిందని, అమాయకుల ఆర్తనాదాలు, ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన ఆఖరి ప్రయత్నాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. అమరవీరులు తమ ప్రాణాలను అర్పించి, భవిష్యత్ తరాలకు స్వేచ్ఛను అందించారని అన్నారు.
ఈ సంఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కీలక మలుపు ఇచ్చిందని, ప్రజలలో జాతీయ చైతన్యం పెరిగి, స్వేచ్ఛా పోరాటం ఉధృతమైందని, వారి త్యాగమే స్వాతంత్ర్య మార్గాన్ని చూపించిందని ఆయన అన్నారు. వారి త్యాగాన్ని వృథా కానివ్వకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, న్యాయం, సమానత్వం కోసం నిలబడాలని, యువత, ప్రజలంతా వారి త్యాగాలను మరువకుండా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుని నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.












