Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 29
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఆత్రం మంతయ్యకు చెందిన ఇల్లు పూర్తిగా కూలి నేలమట్టమైంది. ప్రమాద సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉండటంతో గోడలు కూలి వారిపై పడటంతో మంతయ్య భార్య లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది.
పెద్ద కుమారుడు అజయ్ కాలికి తీవ్ర గాయాలు కాగా, చిన్న కుమారుడు అనిల్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వారికున్న ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా పాడైపోయింది. వెంటనే గాయపడిన వారిని అంబులెన్స్‌లో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎంబరి సజన్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తహసీల్దార్ రాఘవేందర్ రావుకు సమాచారం అందించి, ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా సజన్ కుమార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పల్లె సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓల్వోజీ శ్రీనివాస్ పాల్గొన్నారు.











