ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు పలు దేశాలు చర్యలు చేపడుతున్నప్పటికీ, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. భూమి, అడవులు, నదులు, చిత్తడి నేలలు, సముద్ర తీర ప్రాంతాల పునరుద్ధరణకు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎఫ్ఏఓ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ), జీవవైవిధ్య ఒప్పంద సచివాలయం సంయుక్తంగా రూపొందించిన నేచర్స్ కమ్‌బ్యాక్ స్కేలింగ్ ఎకోసిస్టమ్ రిస్టొరేషన్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ నివేదికను న విడుదల చేశారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థల్లో కనీసం 30 శాతాన్ని సమర్థంగా పునరుద్ధరించాలన్న లక్ష్యంపై ఇందులో సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 149 దేశాల్లో సుమారు 25.2 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో పర్యావరణ పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు నివేదిక గుర్తించింది. ఈ కార్యక్రమాల ద్వారా 10 లక్షలకు పైగా హరిత ఉద్యోగాలు ఏర్పడ్డాయి. అయితే దేశాలు ప్రకటించిన మొత్తం పునరుద్ధరణ లక్ష్యాలతో పోలిస్తే ఇప్పటివరకు అమలులో ఉన్న పనులు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచ దేశాలు సుమారు 100 కోట్ల హెక్టార్ల పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు హామీ ఇచ్చాయి. 2030 లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రస్తుత పనుల వేగాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని నివేదిక పేర్కొంది. పర్యావరణ పునరుద్ధరణలో భూభాగాలకు సంబంధించి కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ, నదులు, సరస్సులు, చిత్తడి నేలలు, సముద్ర తీర ప్రాంతాల్లో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
భూభాగ పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ లక్ష్యంలో 49 శాతం మేర పనులు నమోదయ్యాయి. మంచినీటి పర్యావరణ వ్యవస్థల్లో లక్ష్యానికి సంబంధించి కేవలం 4.5 శాతం పురోగతి ఉంది. సముద్ర, తీర ప్రాంతాల పునరుద్ధరణలో 23 శాతం మేర పనులు నమోదయ్యాయి. ముఖ్యంగా మంచినీటి వనరులు వేగంగా క్షీణిస్తున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నివేదిక సూచించింది. ప్రాంతాలవారీగా చూస్తే ఆసియాలో అత్యధికంగా 19.22 కోట్ల హెక్టార్లలో పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆఫ్రికాలో 3.63 కోట్ల హెక్టార్లు, ఐరోపాలో 91 లక్షల హెక్టార్లు, ఉత్తర, మధ్య అమెరికాలో 58 లక్షల హెక్టార్లు, దక్షిణ అమెరికాలో 54 లక్షల హెక్టార్లు, ఓషియానియాలో 32 లక్షల హెక్టార్లలో పనులు నమోదయ్యాయి. దేశాలవారీగా చైనా అత్యధికంగా 12.74 కోట్ల హెక్టార్ల భూభాగాన్ని పునరుద్ధరణ కార్యక్రమాల పరిధిలోకి తీసుకొచ్చింది. అయితే ఈ గణాంకాలు పునరుద్ధరణ పనుల విస్తీర్ణాన్ని మాత్రమే సూచిస్తాయని, ఆయా ప్రాంతాల్లో పర్యావరణ వ్యవస్థలు పూర్తిగా కోలుకున్నాయని అర్థం కాదని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రస్తుతం ఏటా సుమారు 64 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి ఈ మొత్తాన్ని 296 బిలియన్ డాలర్లకు పెంచాల్సిన అవసరం ఉందని నివేదిక అంచనా వేసింది. అంటే ప్రస్తుత పెట్టుబడులను నాలుగు రెట్లకు పైగా పెంచాలి.
వ్యవసాయ అడవుల పెంపునకు ఏటా 87 బిలియన్ డాలర్లు, అడవుల పునరుద్ధరణకు 52 బిలియన్ డాలర్లు, పీట్ నేలల పునరుద్ధరణకు 44 బిలియన్ డాలర్లు, సముద్రపు గడ్డి వనాల పునరుద్ధరణకు 28 బిలియన్ డాలర్లు అవసరమని పేర్కొంది. ఈ పెట్టుబడులతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 3.2 కోట్ల హరిత ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పర్యావరణ పునరుద్ధరణ కేవలం మొక్కలు నాటడం లేదా కొన్ని ప్రాంతాలను శుభ్రం చేయడంతో పూర్తికాదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. భూమి, నీటి వనరుల సంరక్షణతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడటం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, దీర్ఘకాలిక నిధుల సమీకరణ అవసరమని సూచించింది. ప్రకృతి వనరుల విధ్వంసానికి కారణమవుతున్న అంశాలను నియంత్రించడంతో పాటు పునరుద్ధరణ కార్యక్రమాల ఫలితాలను నిరంతరం పర్యవేక్షించాలని దేశాలకు సూచించింది. మొత్తంగా.. పర్యావరణ పునరుద్ధరణలో ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు పెరుగుతున్నప్పటికీ, 2030 లక్ష్యాలను చేరుకోవడానికి ప్రస్తుత వేగం సరిపోవడం లేదు. ముఖ్యంగా మంచినీటి, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు దేశాలు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది.












